కరోనా నిమిత్తం తరలి వచ్చిన “ఆర్ఆర్ఆర్” హీరోలు

ప్రపంచాన్నే వణికిస్తున్న కరోనా వైరస్ సోకకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ఒక్కొక్కరు ఒక్కో రకమైన సలహాతో ముందుకొస్తున్నారు. రాజకీయ నాయకులైతే దీనికి కులం, మతం తో లింక్ పెట్టి కంపు చేశారు, మరి కొందరు బ్లీచింగ్ పౌడర్, పారాసెటమాల్ అంటూ పెంట చేశారు. ఆ కంపుని, పెంట ని క్లీన్ చేయడానికి ఇప్పుడు రాజమౌళి హీరోలు ముందుకొచ్చారు. కరోనా వైరస్ సోకకుండా ఉండాలంటే మాస్కులు ధరించాలి అనే పోకడని తుడిచేస్తూ నిజంగా దగ్గు, జ్వరం లాంటివి ఉన్నాయనిపిస్తేనే ఆ మాస్కులు వాడాలని, ఊరికే వాడితే ప్రమాదమని, తుమ్ము, దగ్గు లాంటివి వస్తే, అరచేతితో కాకుండా మోచేతి అడ్డం పెట్టుకోవాలని, ఇలా పలు రకాలైన కొత్త పద్ధతులను మన ఇద్దరు హీరోలు తెలిపారు.

ఇలాంటి మరికొన్ని జాగ్రత్తలు www.who.int వెబ్సైట్ లో ఉంటాయని, WHO వాళ్ళ వెబ్సైట్ కాబట్టి దీన్ని నమ్మొచ్చు అని ఒక హామీ కూడా ఇచ్చారు. కరోనా వైరస్ ని అరికట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలంటూ వివిధ సోషల్ మీడియా సైట్ లలో, న్యూస్ ఛానెళ్లలో ఎన్నో రకాలైన పద్ధతులు బైటికొస్తూ జనాలని తికమక పెడుతున్న సమయంలో, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇచ్చిన ఈ వీడియో బైట్ సరిగ్గా ఉపయోగపడుతుందనే చెప్పాలి.