గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక లేరు .. ఆయన జీవిత విశేషాలు

గాన గంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం (74) క‌న్నుమూశారు. గురువారం రాత్రి నుంచి శ్వాస తీసుకోవ‌డానికి తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డ ఆయ‌న శుక్రవారం మధ్యాహ్నాం వెంటిలేట‌ర్‌పైనే తుది శ్వాస విడిచారు. త్వ‌రలోనే పూర్తి ఆరోగ్యంతో వ‌స్తాడ‌నుకున్న అభిమానుల‌ను శోక‌సంద్రంలో ముంచేసి తిరిగి రాని లోకాల‌కు బాలు వెళ్లిపోయారు. బాలు మరణించినట్లు ఆయన కుమారుడు చరణ్‌ మీడియా ముందు ధృవీకరించారు. చెన్నైలోని మౌంట్‌రోడ్డులోని సత్యం థియేటర్ వద్దకు బాలసుబ్రహ్మణ్యం భౌతికకాయం తరలించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సందర్శకుల కోసం చెన్నై అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్పీ బాలుకు క‌రోనా పాజిటివ్ అని తేల‌డంతో ఆగ‌స్టు 5న చెన్నైలోని ఎంజీఎం ఆస్ప‌త్రిలో చేరారు. 50 రోజులుగా వెంటిలేట‌ర్‌పై చికిత్స తీసుకుంటున్న ఆయ‌న మృతి చెంద‌డం ప‌ట్ల‌ ద‌క్షిణాది చిత్ర ప‌రిశ్ర‌మ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసింది. సోష‌ల్ మీడియాలో ప‌లువురు సెల‌బ్రిటీలు ఆయ‌న‌కు అశ్రు నివాళులు అర్పిస్తున్నారు.

ఇంజ‌నీర్ కాబోయి సింగ‌ర్ అయ్యారు
ఎస్పీ బాలు పూర్తి పేరు శ్రీప‌తి పండితారాధ్యుల బాలసుబ్ర‌హ్మ‌ణ్యం.. 1946 జూన్ 4న నెల్లూరులోని కోనేట‌మ్మ పేట గ్రామంలో బ్రాహ్మ‌ణ కుటుంబంలో జ‌న్మించారు. ఈయ‌న‌ సాంబ‌మూర్తి, శ‌కుంత‌ల‌మ్మ దంప‌తుల రెండో సంతానం. ఇంజ‌నీర్ కావాల‌ని క‌ల‌లు క‌ని గాయ‌కుడయ్యారు. సావిత్రిని వివాహం చేసుకున్న ఆయ‌న‌కు చ‌ర‌ణ్‌, శైల‌జ అని ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. శ్రీశ్రీశ్రీ మ‌ర్యాద రామ‌న్న(1966) చిత్రంలోతొలిసారి పాట పాడారు. శంకరాభరణం, సాగరసంగమం లాంటి తెలుగు చిత్రాలే కాకుండా ‘ఏక్ దుజే కేలియే’ లాంటి హిందీ చిత్రాలకు బాలు పాడిన పాటలు దేశమంతా ఉర్రూతలూగించాయి. నాలుగు ద‌శాబ్దాల‌కు పైగా సాగిన‌సినీ ప్ర‌స్థానంలో న‌ల‌భై వేల పైచిలుకు పాట‌లు పాడి గిన్నిస్ రికార్డును సాధించారు. 

త‌మ్ముడి మీద ప్రేమ‌తో నిర్మాత‌గా మారిన బాలు
తెలుగు, త‌మిళ‌మే కాకుండా క‌న్న‌డంలోనూ ఆయ‌న పాడిన పాట‌కు ఎన్నో జాతీయ పురస్కారాలు ల‌భించాయి. త‌మ్ముడు క‌మ‌ల్ హాస‌న్‌కు చేతిలో సినిమాలు లేని స‌మ‌యంలో ఆయ‌న‌ మీదున్న ప్రేమ‌తో బాలు నిర్మాత‌గా మారారు. అలా తీసిని ‘శుభ సంక‌ల్పం’ ఎన్నో అవార్డుల‌ను తెచ్చి పెట్టింది. క‌మ‌ల్ హాస‌న్‌, ర‌జ‌నీకాంత్‌, స‌ల్మాన్ ఖాన్‌, జెమిని గ‌ణేష‌న్ వంటి ప‌లువురు హీరోల‌కు గాత్ర‌దానం కూడా చేశారు. గాన మాధుర్యంతోనే కాదు, న‌ట‌న‌తోనూ బాలు ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిపడేశారు. 1969లో పెళ్ళంటే నూరేళ్ళ పంట అనే చిత్రంలో మొదటిసారి నటుడిగా కనిపించారు. తమిళ ‘కేలడి కన్మణి’లో క‌థానాయ‌కుడి పాత్ర పోషించారు. ఈ సినిమా తెలుగులో ఓ పాప లాలీ పేరుతో అనువాదం అయింది. త‌ర్వాత ప‌విత్ర బంధం, దేవుళ్లు, దేవదాస్‌, మిథునం వంటి ప‌లు సినిమాల్లోనూ న‌టించారు. 

ఎస్పీ బాలు స్పెషల్‌ అదే పాటకే ప్రాణం పోశాడు
ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం..తెలుగు సినిమా గీతాలకు దొరికిన ఒకానొక ఆణిముత్యం. విషాద పాటలైనా, ప్రేమ గీతాలైనా, మాస్ బీట్స్ అయినా.. సందేశాత్మకాలైనా.. ప్రతీది ఆయననోట అలవోకగా జాలువారుతాయి. ఘంటసాల తరువాత ఆ స్థాయి పేరు ప్రఖ్యాతలు పొందిన ఏకైక గాయకుడు. హీరోల వాయిస్‌ తగినట్లు పాడడం ఆయన స్పెషల్‌. చాలామంది నటులకు వారి హావభావలకు, నటనా శైలులకు అనుగుణంగా అతను పాటలు పాడి ప్రాణం పోశారు.  

జీవితాన్నే మార్చేసిన ‘శంకరాభరణం’
ఘంటసాల మరణం తర్వాత తెలుగు సినిమా పాటలకు ఎస్పీ బాలుయే పెద్ద దిక్కయ్యారు. తన గాత్రంతో పాత్రలకు ప్రాణం పోశాడు. ముఖ్యంగా బాలు సినీ జీవితం ‘శంకరాభరణం’
సినిమాతో పూర్తిగా మారిపోయింది. అప్పటివరకు మాస్ గీతాలకే పరిమితం అయిన బాలు.. ఈ సినిమాలో క్లాసికల్ పాటలను సైతం అద్భుతంగా పాడగలనని విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. ఈ చిత్రానికి బాలు తొలిసారి జాతీయ స్థాయిలో ఉత్తమ గాయకుడిగా అవార్డు అందుకున్నాడు. తెలుగులోనే కాదు ఉత్తరాదిన కూడా పాడి తన సత్తా చాటాడు బాలూ. హిందీలో తొలిసారి ‘ఏక్ దూజేలియే’ చిత్రంలో.. అద్భుతంగా పాడి అక్కడివారిచేత శభాష్ అనిపించుకున్నాడు. ఈ సినిమాకు కూడా ఉత్తమ గాయకుడిగా జాతీయ అవార్డు దక్కడం విశేషం. తెలుగు తో పాటు హిందీ, తమిళం, కన్నడ లాంటి నాలుగు భాషల్లో కలిపి ఆరు సార్లు జాతీయ ఉత్తమగాయకుడిగా నిలవడం ఒక్క బాలసుబ్రహ్మణ్యానికే చెల్లింది. ముఖ్యంగా భక్తి పాటలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచారు. అన్నమయ్య, శ్రీరామదాసు, శ్రీరామరాజ్యం చిత్రాలలో బాలు ఆలపించిన భక్తి గీతాలు ఇప్పటకి ప్రతి ఇంటావినిపిస్తూనే ఉన్నాయి.
ఎన్నో అవార్డులు
ఎస్పీ బాలు సుదీర్ఘ ప్రస్థానంలో 6 జాతీయ పురస్కారాలు, 6 ఫిల్మ్ ఫేర్ దక్షిణాది పురస్కారాలు, ఒక ఫిల్మ్ ఫేర్ పురస్కారం అందుకున్నాడు. 1979 లో వచ్చిన సంగీత ప్రధానమైన శంకరాభరణం చిత్రానికి ఆయనకు జాతీయ పురస్కారం లభించింది. రెండు సంవత్సరాల తర్వాత ఆయనకు 1981 లో బాలీవుడ్ లో ప్రవేశించి ఏక్ దూజే కేలియే చిత్రానికి గాను రెండోసారి పురస్కారాన్ని అందుకున్నాడు. తర్వాత సాగర సంగమం(1983), రుద్రవీణ (1988) చిత్రాలకు జాతీయ పురస్కారాలు అందుకున్నాడు. 25 సార్లు ఉత్తమ గాయకుడిగా, ఉత్తమ సంగీత దర్శకుడిగా, ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్టుగా, ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాలు అందుకున్నాడు. 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషన్‌ వరించింది. 1999లొ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం డాక్టరేట్‌ ఇచ్చి గౌరవించింది.
బాలు గురించి మ‌రికొన్ని విష‌యాలు
► ఓ ఇంట‌ర్వ్యూలో బాలు ఇళ‌య‌రాజాను బెస్ట్ కంపోజ‌ర్‌గా పేర్కొన్నారు. కానీ అదే ఇళ‌య‌రాజా త‌న పాట‌లు ఎవ‌రు పాడినా దానికి ఇంత రాయ‌ల్టీ ఇవ్వాల‌ని బాలు అబ్బాయి నిర్వ‌హిస్తున్న సంస్థ‌కు తాఖీదులు పంపారు. మిత్రుడికి లీగల్ నోటీస్ ఇవ్వ‌డ‌మేంట‌ని ఆయ‌న చాలా బాధ‌ప‌డ్డారు.
► బాలుకు అత్యంత ఇష్ట‌మైన గాయ‌కుడు మ‌హమ్మ‌ద్ ర‌ఫీ.
► శ్రీశ్రీశ్రీ మ‌ర్యాద రామ‌న్న చిత్రానికి గానూ మొద‌టి రెమ్యూన‌రేష‌న్ 300 రూపాయ‌లు తీసుకున్నారు.
► ఒక్క శంక‌రాభ‌ర‌ణం సినిమాకు పాడే విష‌యంలో మాత్ర‌మే ప్ర‌త్యేకంగా ప్రాక్టీసు చేశారు.
► గాయకుడిగానే కాకుండా గాత్రదాన కళాకారుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా ఆయా విభాగాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత 29 సార్లు నంది పుర‌స్కారాలు అందుకున్నారు.