‘అభినేత్రి-2’ సినిమా రివ్యూ-రేటింగ్

  • సినిమా : అభినేత్రి-2
  • నటీనటులు : ప్రభుదేవా, తమన్నా, సప్తగిరి తదితరులు
  • రచన, దర్శకత్వం : ఏఎల్ విజయ్
  • నిర్మాత : అభిషేక్ నామా
  • సంగీతం : సామ్‌ సి.ఎస్‌
  • సినిమాటోగ్రఫర్ : అనిల్ మెహతా
  • విడుదల తేదీ : 31-05-19

ప్రభుదేవా, తమన్నా, సోనూసూద్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘అభినేత్రి’ సినిమాకు ఇది సీక్వెల్! మొదటి చిత్రాన్ని తెరకెక్కించిన తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్‌నే ఈ సీక్వెల్‌ని రూపొందించాడు. నిజానికి.. తొలి చిత్రం ఫ్లాప్‌గా నిలిచింది కానీ, కాన్సెప్ట్ థ్రిల్లింగ్‌గా ఉండడంతో దానికి కొనసాగింపుగా రెండో చిత్రం తీశాడు దర్శకుడు. మొదటి దాంట్లో తమన్నాకు ఒక దెయ్యం పట్టుకుంటే.. ఇందులో ప్రభుదేవాకు రెండు దెయ్యాలు పట్టుకుంటాయనేది థీమ్! ఇది కాస్త ఎంగేజింగ్‌గానూ, ప్రోమోలు ఆసక్తికరంగానూ ఉండడంతో.. ఈ చిత్రంపై ఒకింత ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. మరి.. వాటిని అందుకోగలిగిందా? రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం!

కథ : రూబి అనే దెయ్యంతో విముక్తి పొందిన అనంతరం కృష్ణ (ప్రభుదేవా), దేవి (తమన్నా) తమ దాంపత్య జీవితాన్ని సుఖంగా గడుపుతుంటారు. అంతా సవ్యంగానే సాగుతోందనుకుంటున్న క్రమంలో.. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య కృష్ణకు రంగారెడ్డి, అలెక్స్ అనే రెండు దెయ్యాలు పట్టుకుంటాయి. వాటి ప్రభావంతో కృష్ణ తనను ప్రేమించమంటూ ఇద్దరు అమ్మాయిల వెంటపడుతుంటాడు. అయితే… ఈ విషయాలేమి కృష్ణకు తెలియవు. అటు.. తన భర్తకు దెయ్యాలు పట్టుకున్నాయని తెలుసుకున్న దేవి, వాటి నుంచి భర్తను విముక్తి కలిగించడం కోసం ఆ దెయ్యాలతో ఒక అగ్రీమెంట్ కుదుర్చుకుంటుంది. అదేంటి? అసలు రంగారెడ్డి, అలెక్స్ అనే దెయ్యాలు కృష్ణనే ఎందుకు ఆవహించాయి? ఆ దెయ్యాలు వెంటపడే ఆ ఇద్దరమ్మాయిలెవరు? ఆ దెయ్యాల నుండి దేవి తన భర్తను ఎలా కాపాడుకుంది? చివరికీ ఆ దెయ్యాల కోరికలు తీరాయా… లేదా? అనే అంశాలతో ఈ సినిమా సాగుతుంది.

విశ్లేషణ : మొదటి చిత్రంలో తమన్నాకు ఒక దెయ్యం పడితే, ఈ రెండో సినిమాలో ప్రభుదేవాను రెండు దెయ్యాలు పట్టుకుంటాయి. అంతే.. మిగతాదంతా సేమ్ టు సేమ్! కథలు కాస్త అటు, ఇటుగా ఉన్నాయి కానీ.. నేపథ్యం మాత్రం ఒకటే! కాకపోతే.. రెండో మూవీతో పోలిస్తే మొదటిదే చాలా బాగుంది. అంత చెత్తగా ఈ సీక్వెల్‌ని తెరకెక్కించాడు దర్శకుడు విజయ్! రెండు దెయ్యాల కాన్సెప్ట్ ఉండడంతో, తొలి చిత్రం కంటే బాగా థ్రిల్ చేస్తాడనుకున్నాం కానీ.. అందుకు పూర్తి భిన్నంగా చికాకు పుట్టించాడు. అసలు పాయింట్‌ని పక్కనపెట్టేసి.. అనవసరమైన సీన్లతో సినిమాను పక్కదారి పట్టించాడు.

ఫస్టాఫ్‌లో కాస్త ఫన్ జనరేట్ చేయడానికి ప్రయత్నించాడు. హీరోలో రెండు దెయ్యాలు వెళ్ళడం, అతడు విచిత్రంగా ప్రవర్తించడం, అనికేమైందోనని తమన్నా-కోవై సరళ అయోమయానికి గురవ్వడం వంటి సీన్లు కొంచెం ఎంగేజింగ్‌గానే ఉన్నాయి. అక్కడక్కడ హారర్ సీన్లు కూడా కాస్త భయపెట్టించాయి. కానీ.. అవి వర్కౌట్ అయ్యాయి కదా కామెడీ, హారర్ డోస్ పెంచేసి బాగా ఇబ్బంది పెట్టేశాడు దర్శకుడు. చెప్పాల్సిన పాయింట్ చెప్పకుండా ఏవేవో సీన్లు పెట్టేసి, తలలు బద్దలుకొట్టుకునేలా చేశాడు. ఒకచోట సినిమా ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకుంటోందనే ఆసక్తి కలిగేలోపే.. ఆ తర్వాత వచ్చే సీన్ మూడ్ ఖరార్ చేసేసి చికాకు పుట్టించేసేలా చేస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం బాగుంది. ఇక సెకండాఫ్‌లో ప్రభుదేవా, నందితల మధ్య నడిచే లవ్ ట్రాక్ మరీ దారుణం! ఎక్కడా ఆసక్తి లేకుండా మరీ చప్పగా సాగే ఆ ట్రాక్ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది. అసలు అది లేకున్నా బాగుండేదని అనిపిస్తుంది.

రెండు దెయ్యాలు తమ కోరికలు నెరవేర్చుకునే క్రమంలో హీరో ప్రాణానికే ప్రమాదం తీసుకొచ్చేలా ప్రవర్తిస్తాయి. ఈ క్రమంలో హీరో గురయ్యే ఇబ్బందుల్ని ఎమోషనల్‌గా ప్రెజెంట్ చేసే అవకాశం ఉంది. కానీ.. దర్శకుడు అలా చేయకుండా ఏవేవో సీన్లు జోడించి సాగదీశాడు. అసలు హీరో పాత్రనే సరిగ్గా రాసుకోలేదు. తాను చేసిన విచిత్రమైన పనులు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా హీరో చూస్తాడు. దాంతో అతని ప్రవర్తనపై అనుమానం కలుగుతుంది. కానీ ఆ తర్వాత ఏమీ తెలియనట్లుగా ఆ పాత్ర ఉండిపోవడం డిజప్పాయింట్ చేస్తుంది. ప్రీ-క్లైమాక్స్ ఎపిసోడ్ బాగుంది. ముగింపు మామూలే! అసలే స్ర్కిప్ట్ చాలా వీక్.. దానికితోడు చికాకు పెట్టించే సీన్స్ జోడించి, సినిమాను స్లోగా నడిపించి.. ప్రేక్షకుల్ని బాగా ఇబ్బంది పెట్టేశాడు డైరెక్టర్ విజయ్.

నటీనటుల పనితీరు : ప్రభుదేవా తన పాత్ర పరిధి బాగానే నటించాడు. కొన్ని సీన్లలో అతని నటన ఆకట్టుకుంటుంది. డాన్స్ కూడా అదరగొట్టేశాడు. ఇక తమన్నా నటనపరంగా మెప్పించడమే కాకుండా అందాలను బాగా ఆరబోసింది. ముఖ్యంగా ‘రెడీ రెడీ’ అనే సాంగ్‌లో అమ్మడు యమ హాట్‌గా కనిపించింది. నందితా శ్వేతా, రంగారెడ్డి లవర్‌గా నటించిన అమ్మాయి ఫర్వాలేదు. ఇద్దరూ గ్లామర్‌గా కనిపించడంతోపాటు నేచురల్ యాక్టింగ్‌తో మెప్పించారు. కోవై సరళ నవ్వించే ప్రయత్నం చేసింది. మిగిలిన నటీనటులు మామూలే!

టెక్నికల్ పెర్ఫార్మెన్స్ : సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. హారర్ సీన్లలోని విజువల్స్‌ను సహజంగా చూపించారు. సంగీత దర్శకుడు అందించిన సంగీతం పర్వాలేదనిపిస్తోంది. ఇక ఎడిటింగ్ బాగుంది గాని, సెకండాఫ్ ను ఇంకా ట్రీమ్ చేసి ఉంటే బాగుండేది. సినిమాకి తగ్గట్లే నిర్మాణ విలువలు ఉన్నాయి. డైరెక్టర్ ఏఎల్ విజయ్ తన ముద్ర చూపించలేకపోయాడు. రచయితగా, దర్శకుడిగా విఫలమయ్యాడు.

పంచ్ లైన్ : ‘అభినేత్రి-2’.. పెద్ద తలనొప్పి
రేటింగ్ : 2/5

Leave a Reply

*