బిజెపి ఎమ్మెల్యే దాష్టీకం.. నడిరోడ్డుపై మహిళను దారుణంగా కొట్టాడు

ప్రజాసేవే తన ధ్యేయమని మైకుల ముందు ఊదరగొట్టిన ఓ బిజెపి ఎమ్మెల్యే.. తాజాగా తన అసలు రూపం బయటపెట్టాడు. నీటి సమస్యను పరిష్కరించమని అడిగిన పాపానికి ఓ మహిళను విచక్షణారహితంగా కొట్టాడు. ఆ దెబ్బలను తాళలేక ఆ మహిళ కిందపడిపోయినా వదల్లేదు.. కాలితో తన్నుతూ అమానుషంగా ప్రవర్తించాడు. ఈ ఘటన గుజరాత్‌లోని నరోదా ప్రాంతంలో చోటుచేసుకుంది.

ఆ వివరాల్లోకి వెళ్తే.. నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్‌సీపీ) మద్దతుదారైన నీతూ తేజ్వానీ తనతోపాటు కొందరు మహిళల్ని వెంట వేసుకుని బిజెపి ఎమ్మెల్యే బలరామ్‌ తవానీ వద్దకు వెళ్ళింది. తమ ప్రాంతంలో నీటి కొరత తీర్చాలని కోరారు. అయితే.. అందుకు ఆ ఎమ్మెల్యే దురుసుగా సమాధానం ఇచ్చాడు. ఇలాగైతే పని అవ్వదని భావించిన నీతూ.. తమ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించింది. దీంతో ఆగ్రహానికి గురైన బలరామ్‌, ఆయన తమ్ముడు ఆమెపై దాడికి దిగారు. ‘మాకే వార్నింగ్ ఇస్తావా’ అంటూ ఆఫీస్ బయటే చేయి చేసుకున్నారు. ఆమె కిందపడిపోతే కాలితో తన్నుతూ అమానుషంగా ప్రవర్తించారు. నీతూ భర్తపై కూడా దాడి చేశారు.

తమపై ఇలా దాడి చేసినందుకు నీతు, ఆమె భర్త పోలీసుల్ని ఆశ్రయించారు. ఈ గొడవలో నీతు స్వల్పంగా గాయపడడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనంతా కొందరు వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్ అయ్యింది. ఇది చూసిన నెటిజన్లు బలరామ్‌ దుశ్చర్యపై విమర్శలు వెల్లువెత్తారు. దీంతో ఆ ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పారు. తాను భావోద్వేగాలను ఆపుకోలేనని, ఈ ఘటనలో తప్పు తనదేనని, తానేమీ ఉద్దేశపూర్వకంగా చేయలేదని, ఆ మహిళకు క్షమాపణలు చెబుతానని బలరామ్ తెలిపారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

*