‘ఫలక్‌నుమా దాస్’ మూవీ రివ్యూ-రేటింగ్

 • సినిమా : ఫలక్‌నుమా దాస్
 • నటీనటులు : విశ్వక్‌ సేన్‌, హర్షిత గౌర్, సలోని మిశ్రా, తరుణ్ భాస్కర్, ఉత్తేజ్, ప్రశాంతి, తదితరులు
 • దర్శకత్వం : విశ్వక్ సేన్
 • నిర్మాత : కరాటీ రాజు
 • సంగీతం : వివేక్ సాగర్
 • సినిమాటోగ్రఫర్ : విద్యా సాగర్
 • ఎడిటర్ : రవితేజ
 • విడుదల తేదీ : 31-05-19
 • ‘ఈ నగరానికి ఏమైంది’ ఫేమ్ విశ్వక్‌ సేన్‌ కథానాయకుడిగా స్వీయదర్శకత్వంలో తెరకెక్కిన ‘ఫలక్‌నుమా దాస్’ ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ‘అర్జున్‌రెడ్డి’ తరహాలోనే సినిమాపై అంచనాలు పెంచుకునేందుకు మాస్ ప్రమోషన్స్ చేశాడు విశ్వక్‌సేన్! టీజర్, ట్రైలర్లు కూడా ఆసక్తికరంగా ఉండడంతో.. ఈ చిత్రం కూడా ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తుందనే ఎక్స్‌పెక్టేషన్స్ యూత్‌లో పెరిగాయి. మరి.. వాటిని అందుకోగలిగిందా? రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం!

  కథ : దాస్ (విశ్వక్‌సేన్).. ఫలక్‌నుమా ఏరియాలో పుట్టి పెరిగిన ఓ కుర్రాడు. అదే ఏరియాకు చెందిన శంకరన్న అనే రౌడీని చూసి.. తానూ ఓ గ్యాంగ్ పెట్టాలని చిన్నప్పుడే డిసైడ్ అవుతాడు. అనుకున్నట్టుగానే ఒక గ్యాంగ్ తయారుచేసుకుని.. చిన్న చిన్న గొడవలకు దిగుతాడు. ఈ నేపథ్యంలో టినాతో, ఆ తర్వాత సఖితో ప్రేమలో మునిగితేలుంటాడు. ఓరోజు కొందరు సడెన్‌గా శంకరన్నని చంపేస్తారు. తను రోల్ మోడల్‌గా భావించే అన్నను చంపిన కోపంలో.. దాస్ ఆ వ్యక్తుల్ని పోలీసులకు పట్టిస్తాడు.

  ఆ తర్వాత అంత సవ్యంగా సాగుతుందనుకుంటున్న తరుణంలో కొన్ని అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి. దాస్ అనుకోకుండా ఒక హత్య కేసులో ఇరుక్కుంటాడు. మరి ఆ కేసు నుంచి దాస్ బయటపడేందుకు ఏం చేస్తాడు? ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? అసలు ఆ హత్య కేసులో దాస్‌ని ఇరికించిందెవరు? ఆ కేసు నుంచి అతడు బయటపడగలిగాడా? చివరికి తాను అనుకున్నట్టు ఒక గ్యాంగ్ పెట్టుకుని, లైఫ్‌లో సెటిల్ అయ్యాడా? అనే అంశాలతో ఈ సినిమా సాగుతుంది.

  విశ్లేషణ : విడుదలకు ముందు విశ్వక్‌సేన్ చేసిన మాస్ ప్రమోషన్స్ చూసి.. ‘అర్జున్‌రెడ్డి’ తరహాలోనే ఈ చిత్రం మెస్మరైజ్ చేస్తుందని అనుకున్నారు. కానీ.. ఆ అంచనాల్ని పూర్తి స్థాయిలో అందుకోవడంలో ఈ చిత్రం ఫెయిల్ అయ్యింది. అలాగని ఇది పూర్తిగా బాగోలేదని కాదు.. కొన్ని ఎలిమెంట్స్ బాగా హైలైట్ అయ్యాయి. చాలా విషయాల్లో ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేయగలిగింది. కానీ సినిమాను నెమ్మదిగా నడిపించడమే పెద్ద ప్రతికూలతగా మారింది. అదే ఈ చిత్రాన్ని చాలావరకూ దెబ్బేసిందని చెప్పుకోవచ్చు.

  ఫస్టాఫ్‌లో పాత్రల పరిచయానికే ఎక్కువ సమయం తీసుకున్నారు. విశ్వక్‌సేన్ కథ మొదలు ప్రతి పాత్ర గురించి వివరించేందుకు దర్శకుడు టైం బాగా కేటాయించాడు. అక్కడక్కడ చమక్కులు జోడించి, ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేసేందుకు ప్రయత్నించాడు. వినోదం కూడా బాగానే పండింది. కాకపోతే ద్వితీయార్థమే మరీ సాగదీతగా ఉంది. ఆశించిన కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా లేవు. అక్కడక్కడ పేలవమైన కథనం, క్లైమాక్స్‌ను మరీ సాగదీయడంతో ప్రేక్షకులు అసహనానికి గురవుతారు. కొత్త నటీనటులు కూడా ఆయా పాత్రల్లో సరిగ్గా ఇమడలేకపోయారు. సెకండాఫ్‌లోని ఈ మైనస్ పాయింట్లే ఆడియెన్స్‌ను బాగా డిజప్పాయింట్ చేశాయి.

  అయితే.. ప్రేమ, డబ్బు, ఫ్రెండ్‌షిప్ తాలూకు ఎమోషన్స్‌ను వాస్తవికంగా చూపించి ఆకట్టుకున్నాడు. ఇదో రీమేక్ చిత్రం అయినప్పటికీ.. ఆ భావన కలగకుండా నేటివిటీకి తగ్గట్టు సినిమాలో మార్పులు చేసిన తీరుకి దర్శకుడ్ని మెచ్చుకోవచ్చు. సినిమా చివరకి వచ్చేసరికి పాత్రలకు ఏం జరుగుతుందో అనే ఉత్కంఠను బాగా మెయింటైన్ చేశాడు. డైలాగ్స్, టేకింగ్, నటీనటుల నటన… ప్రధానంగా తరుణ్ భాస్కర్, విశ్వక్ సేన్ నటన సినిమాలోనే హైలెట్‌గా నిలిచాయి. అడవిలోని ఫైటింగ్ సీన్ చాలా బాగా వచ్చింది. సెకండాఫ్‌లో కొంచెం జాగ్రత్తలు తీసుకుని ఉండుంటే.. ఈ చిత్రం కచ్చితంగా మరో స్థాయిలో ఉండేది.

  నటీనటుల పనితీరు : దాస్‌గా విశ్వక్‌సేన్ అదరగొట్టేశాడు. యాక్షన్ సీన్స్‌లో ఇరగదీయడమే కాదు.. ఎమోషనల్ సీన్లలోనూ పిండేశాడు. నటనతోపాటు డైలాగ్ మాడ్యులేషన్‌తోనూ ఆకట్టుకుంటాడు. హర్షిత గౌర్, సలోని ఇద్దరూ గ్లామర్‌ ఒలకబోయడమే కాకుండా నటన పరంగా బాగా చేశారు. ఎస్సైగా తరుణ్ భాస్కర్ తన ప్రత్యేకత చాటుకున్నాడు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

  టెక్నికల్ పెర్ఫార్మెన్స్ : సినిమాటోగ్రఫీ సినిమాకి తగట్లు ఉంది. సంగీత దర్శకుడు వివేక్ సాగర్ అందించిన నేపధ్య సంగీతం బాగుంది. నిర్మాత కరాటీ రాజు ప్రొడక్షన్ డిజైన్ కూడా ఆకట్టుకుంటుంది. ఇక దర్శకుడు విశ్వక్‌సేన్ ఫస్టాఫ్‌ని నెమ్మదిగా నడిపించినా ఫన్, ఎమోషనల్ సీన్స్‌తో ప్రేక్షకుడ్ని అలరించాడు. కాకపోతే ద్వితీయార్థంపై ఇంకొంచెం కసరత్తు చేయాల్సింది. తనలోనూ ట్యాలెంటెడ్ దర్శకుడు ఉన్నాడని నిరూపించుకోగలిగాడు.

  పంచ్ లైన్ : మాస్‌ కా దాస్
  రేటింగ్ : 2.75/5

  Leave a Reply

  *