ప్రభుత్వం చేసే కార్యక్రమాల ఖర్చు ఎలా తెలుసుకోవాలి?

ప్రభుత్వం చేపట్టిన పనుల వివరాల్ని సేకరించే అధికారాన్నే ‘సమాచార హక్కు’ అంటారు. దేశ ప్ర‌ధాని జీత‌మెంత‌..? రాష్ట్ర‌ప‌తి విధులు ఏమిటి..? ఫ‌లానా మంత్రి, ఎంపీ లేదా ఎమ్మెల్యే ఫారిన్ టూర్‌లో పెట్టిన ఖ‌ర్చు ఎంత‌..? అసెంబ్లీలో ఎంత మంది పనిచేస్తారు..? ఇలా ప్రభుత్వం, దాని సంస్థ‌లు, దాని ఆధ్వ‌ర్యంలో న‌డిచే ఇత‌ర సంస్థ‌లు నుంచి సమాచారం అడిగే హ‌క్కుంది. ఒకప్పుడు ఈ సౌకర్యం కేవలం పార్లమెంటు, విధాన సభ, విధాన పరిషత్ సభ్యులకు మాత్రమే ఉండేది. అయితే.. ఆయా వివరాలు ప్రజలకూ తెలుసుకునే హక్కు ఉందని భారత ప్రభుత్వం 2005 అక్టోబర్ 12వ తేదీన ఈ సమాచార హక్కు చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చింది. కానీ.. స‌మాచారాన్ని ఎలా అడ‌గాలి..? దాంతో మ‌న‌కు ఎలాంటి ఉప‌యోగం ఉంటుంది..? త‌దిత‌ర వివ‌రాలేవీ చాలా మందికి తెలియ‌దు. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం!

ప్రతీ ప్రభుత్వ విభాగంలోనూ ప్రజా సమాచార అధికారి (పీఐవో), సహాయ ప్రజా సమాచార అధికారి ఉంటారు. కొన్ని సంద‌ర్భాల్లో రెవెన్యూ శాఖకు సంబంధించి తహశీల్దారులే ప్రజా సమాచార అధికారి (పీఐఓ)గా వ్యవహరిస్తుంటారు. ప్రతీ ప్రభుత్వ శాఖ, విభాగంలోనూ ఓ అధికారి తన రెగ్యులర్ విధులతోపాటు పౌరులు కోరిన సమాచారం ఇచ్చే బాధ్యతలను చూస్తుంటారు. పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి, ఎంపీడీవో కార్యాలయంలో ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్, పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి, అగ్నిమాపక కేంద్రంలో లీడింగ్ ఫైర్ మ్యాన్, మండల విద్యా శాఖ అధికారి కార్యాలయంలో మండల విద్యాధికారి, విద్యుత్ శాఖలో డీఈ (ఆపరేషన్స్), వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్, మార్కెట్ కమిటీలో సీనియర్ మార్కెటింగ్ అసిస్టెంట్, మున్సిపాలిటీలో మేనేజర్, కలెక్టరేట్‌లో డీఆర్వో, ఎస్పీ కార్యాలయంలో అదనపు ఎస్పీ సమాచార అధికారిగా వ్యవహరిస్తారు. ఏదేనీ ఫలానా శాఖకు సంబంధించిన సమాచారం అవసరమైతే సమీపంలోని ఆయా విభాగానికి వెళ్లి సమాచార అధికారి ఎవరు? అని అడిగితే తెలియజేస్తారు.

మ‌నం ఏ శాఖ నుంచి సమాచారం కోరుతున్నామో… ఆ శాఖ సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్‌ను ఉద్దేశిస్తూ దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును పోస్ట్ ద్వారా లేదా స్వయంగా వెళ్లి అందజేయవచ్చు. ఇందుకు నిర్ణీత దరఖాస్తు ఫామ్ అంటూ ఏదీ లేదు. తెల్లకాగితంపైనే రాసి సమర్పించవచ్చు. దరఖాస్తుకు రశీదు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. పది రూపాయల రుసుమును ఇండియన్ పోస్టల్ ఆర్డర్ లేదా నగదు రూపంలో చెల్లించాలి. అలాగే, కోరిన సమాచారాన్ని ఇచ్చేందుకు అయ్యే ఖర్చును కూడా భరించాల్సి ఉంటుంది. ప్రతి ఏ4 లేదా ఏ3 సైజు పేపర్‌కు రెండు రూపాయలు, లేదా వాస్తవిక ఖర్చును భరించాలి. ఫ్లాపీ డిస్క్‌ రూపంలో ఇవ్వాలంటే 50 రూపాయల చార్జీ, సీడీ 100 రూపాయలు, డీవీడీ 200 రూపాయల వ్యయం అవుతుంది. అయితే, దారిద్ర్య రేఖ కంటే దిగువన ఉన్నవారికి ఈ రుసుముల నుంచి మినహాయింపు ఉంది. ఏ భాషలో కోరితే అదే భాషలో సమాచారాన్ని ఇవ్వాలి.

దరఖాస్తు అందిన 30 రోజుల్లోగా దరఖాస్తుదారుడికి కోరిన సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. ఒకవేళ కోరిన సమాచారం చట్టంలోని నిబంధనలకు లోబడి ఇవ్వకూడనిది అయితే దరఖాస్తును తిరస్కరిస్తారు. తిరస్కరణకు గల కారణాన్ని తెలియజేస్తూ అప్పీలేట్ అథారిటీ వివరాలు కూడా ఇస్తారు. నిర్ణీత కాల వ్యవధిలోపు స్పందన లేకున్నా దాన్ని తిరస్కరణగానే భావించి అప్పీల్‌కు వెళ్లవచ్చు. కోరిన సమాచారాన్ని ఇవ్వడంలో సంబంధిత అధికారి విఫలమైతే అప్పుడు ఆ అధికారి నిబంధనల మేరకు పరిహారం ఇవ్వాల్సి రావచ్చు. సరైన ఆధారాలతో దరఖాస్తు చేసుకుంటే కమిషన్ ఈ దిశగా ఆదేశాలిస్తుంది. అన్ని ప్రభుత్వ విభాగాలు, వాటి పాలనా తీరు, నిధుల వినియోగంతోపాటు ప్రభుత్వం నుంచి 95 శాతం మేర నిధులు పొందుతున్న ప్రైవేటు సంస్థలు, స్వచ్చంద సంస్థలు ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. మరిన్ని వివరాలకు http://www.rti.gov.in వెబ్ సైట్ ను సంద‌ర్శించ‌వ‌చ్చు.