Trending

ఖబడ్దార్.. చేతులు ముడుచుకుని కూర్చోలేదు.. వైసీపీ నేతలకు బాలకృష్ణ వార్నింగ్

కుటుంబంతో కలిసి మీడియా ముందుకు

నా చెల్లెలిపై వ్యక్తిగత దూషణలకు దిగడం బాధాకరం

మేము దాడికి దిగితే ఏ వ్యవస్థా అడ్డుకోలేదు

ఏం భాష వాళ్లది?.. అసెంబ్లీలో ఉన్నామా? గొడ్ల చావిడిలోనా?

మేమే మీ మెడలు వంచైనా మారుస్తాం

ఇక చంద్రబాబు చెప్పినా మేం వినేది లేదు

ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన అసెంబ్లీలో వ్యక్తిగత విమర్శలు చేయడం బాధాకరమని నందమూరి బాలకృష్ణ అన్నారు. భువనేశ్వరిపై నిన్న అభ్యంతరకర, అసభ్య పదజాలంతో మాట్లాడారంటూ చంద్రబాబు విలపించిన సంగతి తెలిసిందే. దీనిపై నందమూరి బాలకృష్ణ సహా నందమూరి కుటుంబ సభ్యులు పలువురు ఇవాళ మీడియా ముందుకు వచ్చారు. అధికార పార్టీ నేతల తీరుపై మండిపడ్డారు.

చంద్రబాబు చాలా గట్టి మనిషని, ఆయన ఎప్పుడూ కంటతడి పెట్టడం చూడలేదని అన్నారు. తన తండ్రి ఎన్టీఆర్ హయాం నుంచీ అసెంబ్లీలో సమస్యలపైనే కొట్లాడేవాళ్లమన్నారు. అలాంటిది ఇప్పుడు వ్యక్తిగత దూషణలకు దిగుతూ ఎదుటి వారి పరువుపై కొడుతున్నారని విమర్శించారు. తన చెల్లెలు భువనేశ్వరిపై వ్యక్తిగత దూషణలు చేయడం దురదృష్టకరమని మండిపడ్డారు. అధికార పక్షం నేతల మాటలు సహించరానివన్నారు. వారి మాటలు వింటుంటే అసెంబ్లీలో ఉన్నామా? గొడ్ల చావిడిలో ఉన్నామా? అనే అనుమానం కలుగుతోందన్నారు.

ఇక్కడ ఎవరూ చేతులు కట్టుకుని కూర్చోలేదని, భరతం పడతామని ఖబడ్దార్ అని హెచ్చరించారు. వ్యక్తిగతంగా దాడి చేస్తే.. తాము దాడి చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఏ వ్యవస్థా తమను ఇక అడ్డుకోలేదని, ఆ గోడలు బద్దలు కొట్టుకు వస్తామని వార్నింగ్ ఇచ్చారు. వాళ్ల ఫ్యామిలీలోనూ ఏదో సమస్య ఉందని, వాళ్ల కుటుంబ సభ్యులే ఒప్పుకున్నారని బాలకృష్ణ చెప్పారు. తమ కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందంటూ ఓ సమస్యపై వారి కుటుంబ సభ్యులే ముందుకొచ్చి చెప్పారన్నారు. దానిని డైవర్ట్ చేయడం కోసం తమ ఫ్యామిలీపై ఇంత నీచంగా మాట్లాడారన్నారు. ఒక్కసారి మీ ఇంట్లో వాళ్లను వెళ్లి అడిగితే వారేమనుకుంటున్నారో తెలుస్తుందన్నారు. అందరికీ అమ్మలు, భార్యలున్నారని అన్నారు.

తాను ఎమ్మెల్యేనేనని, తనపై లేదంటే చంద్రబాబుపై రాజకీయ విమర్శలు చేసుకుంటే ఫర్వాలేదని అన్నారు. కానీ, రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని వారిపై దూషణలు చేయడమేంటని ప్రశ్నించారు. తన సోదరికీ సమాజంలో గౌరవమైన స్థానం ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధిని పక్కనపెడితే.. కనీసం పేదలకు కొంతైనా సేవ చేశారా? అని ప్రశ్నించారు. దోచుకున్న సొమ్మును ఇంట్లో దాచుకోవడం తప్ప ఏం మంచి చేశారని మండిపడ్డారు.

సభలో హుందాగా నడుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. స్పీకర్ ఉన్నా లేనట్టే ఉందని, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబు ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారని, ఇప్పుడు ఏం జరుగుతోందని ఆయన ప్రశ్నించారు. సలహాలు ఇస్తే తీసుకోరని, ప్రతి దాడి చేస్తున్నారని అన్నారు. ప్రతిదానికీ ద్వంద్వార్థాలు తీయడం, టాపిక్ ను డైవర్ట్ చేయడం మంచి సంస్కృతి కాదని హితవు పలికారు. ‘‘మంచి చెప్పినా మీరు మారరు. మీరు మనుషులు కాదు. మేమే మెడలు వంచి మిమ్మల్ని మారుస్తాం. మా కుటుంబ సభ్యులే కాకుండా.. ప్రజలు, నా అభిమానులు, పార్టీ కార్యకర్తలు మీ మెడలు వంచుతారు’’ అని అన్నారు.

ఇన్నాళ్లూ ఎన్ని అవమానాలు చేస్తున్నా ఎందుకులే అని ఊరుకుంటున్నామని, చంద్రబాబు కూడా తమను వారించారని, దేనికైనా ఓ హద్దుంటుందని అధికార పార్టీ నేతలపై మండిపడ్డారు. జరిగిన దానిపై ఉపేక్షించేది లేదని తమ కుటుంబం మొత్తం ఫిక్స్ అయిందని చెప్పారు. పదవులు శాశ్వతం కాదని, ఇవాళ మీరున్నారు..రేపు మేమొస్తామని అన్నారు. ఇవాళ రాష్ట్రంలోని వ్యవస్థలను ప్రభుత్వం ఏవిధంగా నిర్వీర్యం చేసిందో జనాలు చూస్తున్నారని అన్నారు.

చంద్రబాబు హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా బాగుండేదని, కానీ ఇప్పుడు ఉద్యోగులకు జీతాలూ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. చంద్రబాబు మంచి ముందుచూపున్న వ్యక్తి అని అన్నారు. ఇకపై విర్రవీగి మాట్లాడితే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలన్నారు. ఇకపై ఎవడైనా ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోబోమని, చంద్రబాబు అనుమతి తమకు అవసరం లేదని హెచ్చరించారు. ఇప్పటిదాకా తాము సహనంగా ఉన్నామంటే దానికి చంద్రబాబే కారణమన్నారు. ప్రజాప్రతినిధులైనందువల్లే మీకు చంద్రబాబు ఇన్నాళ్లూ గౌరవం ఇచ్చారని, ప్రజల కోసం మంచి సూచనలిచ్చారని అన్నారు.

About the author

admin

Telugu News, Telugu Cinema News,Telugu Cinema Videos,Telugu Cinema Actress Photos, Hot Gossips,Tollywood Gossips News,

Leave a Comment