‘ఎన్జీకే’ మూవీ రివ్యూ-రేటింగ్

  • చిత్రం : ఎన్జీకే
  • నటీనటులు : సూర్య, సాయిపల్లవి, రకుల్ ప్రీత్, దేవరాజ్, తదితరులు
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : సెల్వరాఘవన్ (శ్రీ రాఘవ)
  • నిర్మాతలు : ఎస్.ఆర్.ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు
  • సంగీతం : యువన్ శంకర్ రాజా
  • సినిమాటోగ్రపీ : శివకుమార్ విజయన్
  • విడుదల : 31-05-19

తమిళ హీరో సూర్యకు కోలీవుడ్‌కి సమానంగా టాలీవుడ్‌లోనూ మంచి మార్కెట్ ఉంది. అందుకే.. ఆయన ప్రతి సినిమాల్ని ఇక్కడ కూడా విడుదల చేస్తారు. తాజాగా సూర్య చేసిన ‘ఎన్జీకే’ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. వరుస ఫ్లాపులతో వరుస ఫ్లాపులతో అల్లాడిపోతున్న సూర్య.. ఈసారి గట్టిగా కొట్టాలనే ఉద్దేశంతో విలక్షణ దర్శకుడు సెల్వ రాఘవన్‌తో జతకట్టాడు. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో ‘ఎన్జీకే’ మూవీ చేశాడు. అసలే వీరిది క్రేజీ కాంబినేషన్.. దానికితోడు సబ్జెక్ట్ పాలిటిక్స్‌కి సంబంధించింది కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి.. వాటిని అందుకోవడంలో ఈ చిత్రం సక్సెస్ అయ్యిందా? లేదా? రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం!

కథ : ఎన్జీకేగా పిలువబడే నందగోపాల కృష్ణ (సూర్య) ఎంటెక్ పూర్తి చేసిన అనంతరం తన ఊరిలో ఆర్గానిక్ వ్యవసాయం మొదలుపెడతాడు. దాని గురించి ఊరిలో ఉంటున్న అందరిలోనూ చైతన్యం తెచ్చే ప్రయత్నం చేస్తాడు. అయితే.. అతడు చేసే ఆ పని కొందరికి నచ్చక, నానా రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. ఈ విషయంలో తనకు సాయం చేయమని స్థానిక ఎమ్మెల్యే దగ్గరకు వెళ్తాడు. అతడు సహాయం చేసినట్లే చేసి.. ఎన్జీకేను ఇరుకున పెడతాడు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్జీకే ఆ ఎమ్మెల్యే వద్ద అసిస్టెంట్‌గా చేరాల్సి వస్తుంది. ఆ తర్వాత అతడి దిశే మారిపోతుంది. కొంత కాలంలోనే రాజకీయాలు బాగా వంటపట్టిన ఎన్జీకే.. ఒక పెద్ద లక్ష్యం పెట్టుకుని దూసుకుపోతాడు. ఇంతకీ అతని లక్ష్యం ఏంటి? దాన్ని అతడు ఎలా అందుకున్నాడు? ఈ ప్రయాణంలో ఎదురైన సమస్యల్ని ఎన్జీకే ఎలా ఎదుర్కొన్నాడు? అనే అంశాలతో సినిమా సాగుతుంది.

విశ్లేషణ : ఒకప్పుడు స్ర్కిప్ట్ సెలక్షన్లలో సూర్యకు తిరుగే లేదు. విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకుల్ని అబ్బురపరిచేవాడు. కానీ.. ఈమధ్య అతడి జడ్జిమెంట్‌లో తేడా కొట్టేసింది. గతంతో పోలిస్తే.. కొన్నాళ్ళ నుంచి సూర్య తన స్థాయికి తగిన సినిమాలు చేయడం లేదు. ఇప్పుడు ‘ఎన్జీకే’తో సూర్య స్ర్కిప్ట్ సెలక్షన్‌లో పూర్తిగా విచక్షణ కోల్పోయాడని అనిపిస్తుంది. అటు సెల్వరాఘవన్ కూడా ఒకప్పుడు ఇంటెలిజెంట్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీని ఏలాడు. కానీ.. ఈ చిత్రంతో అతడు పూర్తిగా ఔట్ డేట్ అయిపోయాడని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు.

ఈ సినిమా కథ కొత్తదేమీ కాదు.. ఆల్రెడీ ఇలాంటి పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో చాలా సినిమాలొచ్చాయి. ఇందులో ఏదైనా ప్రత్యేకత జోడించి సూర్య-సెల్వ ద్వయం ఎంగేజ్ చేస్తారనుకుంటే.. రొటీన్ రొడ్డకొట్టుడుతోనే నిరుత్సాహ పరిచారు. హీరో అనుకోకుండా రాజకీయాల్లోకి వెళ్ళిపోవడం, ఆ వెంటనే పేరు తెచ్చుకోవడం, ధర్నా-స్పీచ్‌తో ఏకంగా సీఎం అవ్వడం.. ఎక్కడా కన్విన్సింగ్‌గా అనిపించదు. డైరెక్టర్ సినిమా లిబర్టీని మరీ దారుణంగా వాడేసుకున్నాడు. ప్రస్తుత సమాజంలోని ఓ అంశాన్ని తీసుకుని సినిమాగా చిత్రీకరిస్తున్నప్పుడు.. అది సహజత్వానికి దగ్గరగా ఉండేలా జాగ్రత్త పడాలి. వాస్తవ పరిస్థితులు దగ్గరగా ఉండేలా కథని అల్లాల్సి ఉంటుంది. అందుకు తగ్గట్టు డ్రామా, ఎమోషన్స్ పండించగలగాలి. ప్రేక్షకులు సైతం అదే ఆలోచిస్తారు. ఇదో పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన మూవీ కాబట్టి.. సెల్వ, సూర్య బాగా గ్రౌండ్ వర్క్ చేసి.. ఏదో మెసేజ్ ఇవ్వబోతున్నారని అంతా భావించారు.

కానీ.. తీరా సినిమా చూశాక అందరి ఫ్యూజులు ఎగిరిపోవాల్సిన పరిస్థితి! మనం ఊహించిందొకటి, వాళ్ళు చూపించింది ఇంకొకటి! అసలే సాధారణమైన కథ, దాన్ని అంతే పేలవంగా తెరకెక్కించి, ప్రేక్షకులకు బాగా ఇబ్బంది పెట్టేశారు. ఎక్కడా సినిమా ఎంగేజింగ్‌గా అనిపించదు. దీనికితోడు విపరీతమైన తమిళ నేటివిటీ.. సహజత్వం లేని సీన్ల వల్ల ఈ చిత్రం బాగా నస పెట్టేసింది. సూర్య తన పెర్ఫామెన్స్‌తో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశాడు కానీ.. బిగి లేని కథనం, కొత్తదనం లేని సన్నివేశాలు దెబ్బేశాయి. ప్రథమార్ధంలో అక్కడక్కడా కొంత మేర వినోదం పంచడంతో పాటు సినిమాపై ఆసక్తి రేకెత్తించింది కానీ… ద్వితీయార్ధమే తలాతోకాలేని బోరింగ్ సీన్లతో పూర్తిగా పట్టాలు తప్పింది. చివర్లో సూర్య ఇచ్చే ఒక స్పీచ్ మాత్రం అదిరింది. కానీ.. అప్పటివరకూ పెట్టిన నస కారణంగా అది కూడా తేలిపోయింది.

నటీనటుల ప్రతిభ : సినిమా రిజల్ట్ సంగతి పక్కనపెడితే.. సూర్య తనవంతు సిన్సియర్ ఎఫర్ట్ పెట్టాడు. చాలా సీన్లలో కళ్లతోనే హావభావాలు పలికించి, రొమాలు నిక్కబొడుచుకునేలా చేశాడు. సాయిపల్లవి పాత్ర చిన్నదే అయినా.. ఉన్నంతలో తన ప్రత్యేకత చాటింది. రకుల్ ప్రీత్ పాత్రకు మొదట్లో బాగా బిల్డప్ ఇచ్చారు కానీ, ఆ తర్వాత తేల్చేశారు. లుక్ పరంగా మాత్రం ఆమె బాగా సెట్ అయ్యింది. మిగతా నటీనటులంతా తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని వాళ్ళే కావడంతో.. వారి క్యారెక్టర్లకు అంతగా కనెక్ట్ అవ్వలేం!

టెక్నికల్ పెర్ఫార్మెన్స్ : యువన్ శంకర్ రాజా పాటలేవీ బాగోలేవు కానీ.. నేపథ్య సంగీతం విషయంలో మాత్రం ఆకట్టుకున్నాడు. చాలా సీన్లను బాగా ఎలివేట్ చేశాడు. శివకుమార్ విజయన్ సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకే! నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు సెల్వ రాఘవన్ విషయానికొస్తే.. ఎక్కడా తన ముద్రను చూపించలేకపోయాడు. ఒకప్పుడు సాధారణ కథల్లోనూ ప్రత్యేకత జోడించి సర్‌ప్రైజ్‌లు ఇచ్చిన ఈ దర్శకుడు.. ఇప్పుడు ఔట్‌డేటెడ్ అయిపోయాడని ‘ఎన్జీకే’ తేల్చి చెప్పేసింది.

చివరగా : ఎన్జీకే.. భరించడం చాలా కష్టం!
రేటింగ్ : 1.75/5

Leave a Reply

*